top of page

అంతరించిపోతున్న మానవుడు!

Updated: Apr 8, 2021అంతరించిపోతున్న మానవుడు!

అవును నువ్వు విన్నది నిజమే

మనిషి అంతరించిపోతున్నాడు.


సగటు జీవి అవసరాలను ఆసరాగా చేసుకొని

నరకం అనుభవిస్తున్న వారిని చూసి నవ్వుతూ

అర్ద రూపాయి బతుకుల మీద ముప్పావలా భారం మోపుతూ

అధికార శిఖరాల అంచున నిలబడి అహావతారమెత్తి తరలిపోయాడు.


సమాజానికి తండ్రి స్థానాన నిలబడ్డ మరో తండ్రి జేబుల్లో చిల్లర లాక్కుని బెత్తంతో వాయిస్తున్నాడు.


ఆయువు పోసే శ్వేత వస్త్రాలు రక్తం పీల్చి రంగుమారాయి.


అన్యాయాన్ని న్యాయంగా అమ్ముతూ

కులాల గజ్జితో కొట్టుమిట్టాడుతూ

మత్తులో మగతగా తూలుతూ వాలుతూ

మతోన్మాద మదొన్మాదాల పెట్రేగిపోతూ

తల్లెవరో చెల్లెవరో ఇల్లాలు ఎవరో తెలియక

అంతరించి పోయాడు.